నేనొక నటుడ్ని
చంకీల బట్టలేసుకొని అట్టకిరీటం పెట్టుకొని
చెక్క కత్తి పట్టుకుని కాగితాల పూల వర్షంలో
కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను
కాలాన్ని బంధించి శాసించే నియంతని నేను
నేనొక నటుడ్ని
నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్ని
నేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్ని
వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని
వేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని
నేనొక నటుడ్ని
నవ్విస్తాను ఏడిపిస్తాను
ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను
హరివిల్లుకు ఇంకో రెండు రంగులు వేసి
నవరసాలు మీకిస్తాను
నేను మాత్రం నలుపు తెలుపుల
గందరగోళంలో బ్రతుకుతుంటాను
నేనొక నటుడ్ని
జగానికి జన్మిస్తాను
సగానికి జీవిస్తాను
యుగాలకి మరణిస్తాను
పోయినా బ్రతికుంటాను
నేనొక నటుడ్ని
లేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్ని
ఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్ని
ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని
అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని
నేనొక నటుడ్ని
గతానికి వారధి నేను
వర్తమాన సారధి నేను
రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను
పూట పూటకి రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను
నేనొక నటుడ్ని
పిడుగుల కంఠాన్ని నేను
అడుగుల సింహాన్ని నేను
నరంనరం నాట్యం ఆడే నటరాజ రూపాన్ని నేను
ప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేను
ప్రఛండంగా ప్రకాశించు రంగమార్తాండున్ని నేను
నేనొక నటుడ్ని
అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుడ్ని
కానీ తొమ్మిది తలలు ఉన్న నటరాణుడ్ని
నింగీనేల రెండడుగులైతే
మూడో పాదం మీ మనసులపై మోపే వామనుడ్ని
మీ అంచనాలు దాటే ఆజానుబాహున్ని
సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని
నేనొక నటుడ్ని
అప్సరసల ఇంద్రుడ్ని
అందుబాటు చంద్రుడ్ని
అభిమానుల దాసుడ్ని
అందరికీ ఆప్తుడ్ని
చప్పట్లను భోంచేస్తూ
ఈలలను శ్వాసిస్తూ
అణుక్షణం జీవించే
అల్ప సంతోషిని నేను
మహా అదృష్టవంతుడిని నేను
తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే
సగటు కళాకారుడ్ని నేను
ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు
నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు
శతకోటి నమస్సులు మీకు