ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
ఓ ప్రియతమా ఇది నిజమా
ఈ పరిచయం ఒక వరమా
ఇది మనసు పడిన విరహ వేదనా
తొలి ప్రేమలోని మధుర భావనా
ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా
ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా
నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చిగురించెనో
వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో
ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై వీచాయో చెప్పేదెలా
ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా
ఓ ప్రియతమ దయగనుమా
నీ చూపే చాలు చంద్రకిరణమా
నా జన్మ ధన్యమవును ప్రాణమా
చివురాకుల పొత్తిలిలో వికసించిన సిరిమల్లెవో
చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో
నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే
పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే
నీ నామాన్నే శృంగార వేదంగ భావించి జపిస్తున్నానే చెలి
నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి
ఓ ప్రియతమ అవుననుమ
కనలేవ ప్రియుని హృదయవేదనా
కరుణించు నాకు వలపు దీవెనా
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా