తోడుగా మా తోడుండి
నీడగా మాతో నడిచి
తోడుగా మా తోడుండి
నీడగా మాతో నడిచి
నువ్వెట్టా వెళ్ళినావు కొమురయ్యా
నీ జ్ఞాపకాలు మరువమయ్యో కొమురయ్యా
కొడుకునెట్లా మర్సినావే కొమురయ్యా
నీ బిడ్డనెట్టా మర్సినావే కొమురయ్య
బలగాన్ని మర్సినావా
బాంధవుల మర్సినావా
బలగాన్ని మర్సినావా
బాంధవుల మర్సినావా
నువ్వెక్కడెల్లినావు కొమురయ్యా
నీ జ్ఞాపకాలు మరవలేము కొమురయ్యా
ఇయ్యాల కొమురయ్య మా అందు గలిగి
మాతో ఈ పదాలు పలికిస్తున్నాడో ఏమో
ఎల్లిపోతున్న నా కొడుకా
నా కొడుకా ఐలయ్య కైలయ్య
అయ్యయ్యో నా కొడుకా ఐలన్న
ఎల్లిపోతున్న నా కొడుకా
సినకొడకా మొయిలన్న మొయిలన్న
సినకొడకా మొయిలన్న బైలన్న
దయగల్ల లచ్చవ్వ లచ్చవ్వ
నేనెళ్ళిపోతున్న నా బిడ్డా
నేనెళ్ళిపోతున్న లచ్చవ్వ
అయ్యా లచ్చవ్వ
నన్నిచ్చిన దేవుడేమో
నా కాకు జింపినాడు
నా ఆట ముగిసిందని
నన్ను పైకి బిలిసినాడు
నువ్వు కాశీకి బోయినగాని నా కొడుకా
కన్నతండ్రి గాన రాడు నా కొడుకా
ఏ తీర్థము తిరిగినగాని నా బిడ్డ
ఈ కన్నతండ్రి తిరిగిరాడు నా బిడ్డ
పెద్ద కొడుకా ఐలయ్య నా తొలిసూరు కొడుకువు
ప్రేమగల్ల పెద్ద కొడకా ఐలన్న
నిన్ను పావురంగా సాదుకున్న ఐలన్న
పావురంగా సాదుకున్న ఐలన్న
గున్న గున్న తిరుగుతుంటే గుండెల్లో వెట్టుకున్న
నా గుణమే వచ్చిందని ఊరంతా జెప్పుకున్న
ఊరంతా జెప్పుకున్న
సత్తెనైనా సారుపాని ఐలన్న
నీకు దండసేసి మురిసినాను ఐలన్న
నేనెంతో సంబరబడ్డ ఐలన్న
చిన్న కొడుకా మొయిలన్న
గావురాల కొడుకువి నువ్వు మొయిలన్న
నా ముద్దుల కొడుకువు నువ్వు మొయిలన్న
సిలకోలే సాదుకున్న మొలకోలే బేర్చుకున్న
భుజాల గూర్చోబెట్టి బువ్వదిన బెట్టుకున్న బువ్వదిన బెట్టుకున్న
సుక్కలాంటి సుజాతని మొయిలన్న
నీ పక్కనుంచి సంబరపడ్డ మొయిలన్న
బిడ్డ లచ్చవ్వ నా బంగారు తల్లి
ఎక్కాని కొండ లేదే లచ్చవ్వ నీకై
మొక్కాని బండ లేదు లచ్చవ్వ
దిష్టి చుక్క బెట్టుకొని లచ్చిమోలే దిద్దుకుంటి
అమ్మవిడిచి పోయిందాని
కంటికి రెప్పవోలె కాపాడుకుంటి బిడ్డ
కాసుకుంటి గాదే బిడ్డ
కాసుకుంటి గాదే బిడ్డ
అల్లుడా నారాయణ
నా ఇంటి లచ్చిమిని అల్లుడా
నీ చేతుల వెట్టినాను అల్లుడా
నీ చేతుల వెట్టినాను నా అల్లుడా
ఐలయ్య ఇంటికి పెద్దోడంటే నా కొడకా
పెద్దమనసుండాలె నా కొడకా
పంచుకున్న రక్తము నా కొడకా
పైలంగా దాయాలే నా కొడకా
కన్నబిడ్డలోలే నువ్వు ఐలయ్య
తోడబుట్టినవాళ్ళని జూడు నా కొడుకా
పిల్లల కోడి తీరు నా కొడుకా
నీ రెక్కల్ల దాచుకోరా నా కొడుకా
నీ రెక్కలల్ల దాసుకోరా నా కొడుకా
చిన్నకొడుకా మొయిలన్న
అన్నంటే తండ్రెనక తండ్రి కొడుకా
అన్ననొక్క మాటంటే నన్నన్నట్టే
మర్చిపోకు బిడ్డ అవ్ బిడ్డ
ఒక్క తల్లి పిల్లలు నా కొడుకా
కూడిమాడుండాలే నా కొడుకా
కూడిమాడుండాలే నా కొడుకా
కలిసిమెలిసుండాలె మొయిలన్న
అన్నాకు బాధలొత్తే తమ్ముడు సూడావాలె
తమ్ముడికి బాధలొత్తే అన్నైనా సూడావాలె
నీకొప్పజెప్పుతున్న ఐలయ్యా
తమ్మున్ని పైలంగా జూడు ఐలయ్యా
తమ్మున్ని పైలంగా జూడరా నా కొడుకా
బిడ్డా మీ ఇద్దరి మధ్యల
ఒక్క చెల్లి ఉన్నదని
మర్చి పోకుండి కొడుకా
ఆడబిడ్డ ఆశపడ్తది కొడుకా
ఎండి బంగారం ఎంతున్నాగాని
పుట్టినింటి ఎల్లిపాయే కారం మెతుకులే గొప్పై బిడ్డ
నా ఇంటి దీపమేరా లచ్చవ్వా
దాని కంటే నీరు రావద్దు నా కొడుకా
నీ చెల్లె ఏడ్తావుంటే నా కొడుకా
నా జీవి సరిగబట్టదు నా కొడుకా
పచ్ఛాని సంసారమురా నా కొడుకా
మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా
మీరు ఇచ్చుకపోవద్దురా నా కొడుకా